న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టులో జడ్జీల పదోన్నతుల కోసం రాష్ట్ర మూలాలున్న న్యాయవాదులకే ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్. సురేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డీఎల్ పాండు నేతృత్వంలోని బృందం గురువారం ఢిల్లీలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు బెంచ్ నియామకాల్లో తెలంగాణకు చెందిన న్యాయవాదులకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జ్యుడీషియల్ సర్వీస్ ద్వారా జరిగే నియామకాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన జిల్లా జడ్జీలను కూడా హైకోర్టు పదోన్నతి కోసం పరిశీలిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నియామకాలు చేపట్టేటప్పుడు తెలంగాణ మూలాలున్న అర్హులైన ప్రాక్టీస్ న్యాయవాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నియామకాల్లో సామాజిక న్యాయం, సమానత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
జడ్జీల సంఖ్యను పెంచండి..
తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ప్రస్తుతం ఉన్న 42 జడ్జీల సంఖ్యను 60కి పెంచాల్సిన అవసరం ఉందని, ఇందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. దీంతోపాటు రాష్ట్ర హైకోర్టు నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లిన జడ్జీలను తిరిగి తెలంగాణకు బదిలీ చేయాలని కోరారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న జడ్జీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
